న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 1 (ఇయ్యాల తెలంగాణ) : భావితరాల భవిష్యత్ కోసం BCల కుల గణన చేయాల్సిందేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. గురువారం డీల్లీ లోని తెలంగాణ భవన్ లో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణనలో కులగణన చేపట్టీ పార్లమెంటు లో బిల్లు ప్రవేశపెట్టాలని,లేని యెడల తమ పోరాటం తీవ్ర తరం చేస్తామని అన్నారు. చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, మరియు రాజకీయ రంగాలలో బీసిలకు జనాభా లెక్కల ప్రకారం వాటా ఇవ్వాలన్నారు. విద్యా ఉద్యోగాల్లో స్ధానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి అభ్యంతరాలు ఏంటో చేప్పాలని ఆర్ కృష్ణయ్య కేంద్రానికి డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ లకు జనాభా ప్రాతిపదికన చట్ట సభల్లో రిజర్వేషన్లు ఉన్నాయని, బీసీలకు అలాంటి రిజర్వేషన్లు వర్తింపజేయక పోవడం దారుణమన్నారు.
పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు డీల్లీలోనే …. దాసు సురేష్
పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు డీల్లీలోనే ఉంటు తమ పోరాటాలను దాసు సురేష్ ఆధ్వర్యంలో ఉద్రుతం చేస్తామని, అన్నారు. బిసి గణన, బీసి బిల్లు కోసం అన్ని ప్రముఖ పార్టల ఎంపిల మద్దతు కూడగడుతామని బిసీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల బీసీ ఎంపిలతో త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, కొనసాగించాల్సిన కార్యాచరణ పై చర్చిస్తామని అన్నారు. బీసీల ఓట్లతో అందలం ఎక్కి బీసీ బిల్లుకు పార్లమెంటు లో అనుకూలంగా నిలబడని ఎంపిల, మంత్రుల ఇళ్ళను ముట్టడిస్తామని అన్నారు. ఈ సమావేశంలో నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలం వెంకటేష్, బీసి న్యాయవాదుల జేఏసీ నాయకులు జక్కుల వంశీ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ, గొల్లపల్లి సునీల్ తోపాటు పలువురు పాల్గొన్నారు.