పెళ్లి ముహూర్తాలకు ఇప్పట్లో కష్టమేనా ?
కఠిన ఆంక్షల నేపథ్యంలో పెళ్లిళ్ల వాయిదాకే మొగ్గు
దెబ్బతిన్న కోట్లాది రూపాయల వ్యాపారం
హైదరాబాద్,మే8(ఇయ్యాల తెలంగాణ ): కరోనా అన్ని రంగాల పైనా తీవ్ర ప్రభావం చూపినట్లు గానే పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు లాక్‌డౌన్ పాక్షికంగా ఎత్తేసినా పెళ్లిళ్లు అనుమానమే అని పురోహితులు అంటున్నారు. కేవలం 50 మందికి మాత్రమే పెళ్ల్లిలకు అనుమతి ఇవ్వడంతో పెళ్లిళ్లు జరగడం అనుమానమే అని అంటున్నారు. అత్యవసరమైన వారు దగ్గరి బందువులను పిలుచుకొని తంతు ముగిస్తారు. దీంతో ఈ రంగంపై ఆధారపడ్డ అనేక అనుబంధ పనులకు సంబంధించిన వారి ఉపాధి కోల్పోనుంది.కరోనా కారణంగా ఇంతకాలం పెళ్లిళ్లు వాయిదా పడుతూ వచ్చాయి. గత నెల 22న జనతా కర్ఫ్యూ, ఆ వెంటనే దేశ వ్యాప్త లాక్‌డౌన్ విధించడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఆగిపోయాయి. భౌతిక దూరం పాటించడమే కరోనా వైరస్‌కు విరుగుడని నిపుణులు తేల్చడంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. దీంతో పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడింది. అప్పటికే నిశ్చయమైన ఎన్నో పెళ్లిళ్లు ఆగిపోయాయి. వచ్చే ఐదారు నెలల్లో ముహూర్తాలు ఉన్నా వేలాది మంది శుభకార్యాల నిర్వహణకు ముందుకు రావడం లేదు. తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకునే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇలా కరోనా కారణంగా వేలాది పెళ్ల్లిు వాయిదా పడ్డాయి. వైరస్ ప్రభావం తగ్గిన తరువాత తిరిగి ముహూర్తాలు చూసుకోవచ్చని చాలా మంది పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. మే 29 నుంచి జూన్ 7 వరకు శుక్ర మౌఢ్యం ఉండడంతో ఆ సమయంలో శుభ ముహూర్తాలు లేవు.
ఆ తరువాత ఉన్నప్పటికీ వర్షాకాలం సీజన్ మొదలవుతుంది. దీంతో ఆగస్ట్ తరవాత ముహూర్తాలు ఉన్నా.. అనుమానమే అని అంటున్నారు. ఏప్రిల్, మే మాసాల్లో ముహూర్తాలకు సంబంధించి చాలా ఫంక్షన్ హాళ్లు ఎప్పుడో బుక్ అయిపోయాయి. అయితే, కరోనా ప్రభావంతో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. దీంతో అడ్వాన్సు వాపస్ ఇవ్వాల్సి వచ్చిందని ఫంక్షన్ హాల్ నిర్వాహకులు తెలిపారు. తరువాత తేదీ ఖరారు చేసుకున్నాక తిరిగి అడ్వాన్సు ఇస్తామంటూ చాలా మంది డబ్బు రిటర్న్ తీసుకున్నారని చెప్పారు. పెళ్లిళ్లపై ఆధారపడి వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇందులో కోట్లాది రూపాయల బిజినెస్ ముడిపడి వుంది. ఫంక్షన్ హాళ్లలో పని చేసే వారితో పాటు డెకొరేటర్స్, క్యాటరర్స్, కుక్, సర్వర్స్, మేతాళం, బ్యాండు మేళం, ఫొటో, వీడియో గ్రాఫర్స్.. ఇలాంటి వారంతా కరోనా కారణంగా ఉపాధికి దూరమయ్యారు. పెళ్లి పందిళ్లు తయారు చేసేవారు, డెకరేషన్ చేసే వారు, వంటవారు, మేళ తాళంతో పాటు పంతుళ్లూ పనిలేక ఉండాల్సి వస్తోంది.
సీజన్‌లో నాలుగు డబ్బులు సంపాదించాలని ఆశపడ్డ వారిని కరోనా దారుణంగా దెబ్బ తీసింది. మరో పదిహేను, ఇరవై రోజులు ఇలాగా ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో వారంతా ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు వస్త్ర దుకాణాలు , బంగారు షాపులు , ఫర్నిచర్, స్టీల్ దుకాణాలు , లేడీస్ ఎంపోరియరు… ఇలా రకరకాల వ్యాపారాలు జోరుగా సాగేవి.
పెళ్లిళ్లు లేకపోవడంతో ఆయా వ్యాపారాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. సీజన్‌లోనే మూతవేసి ఉంచడం మూలంగా కిరాయిు చెల్లించడం, పని వాళ్లకు జీతాలు సమకూర్చడం భారంగా మారింది. అలాగే బంగారు ఆభరణాలు చేసే స్వర్ణ కారులు , పెళ్లి తంతు నిర్వహించే బ్రాహ్మణులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా కరోనా ఎంతో మంది ఉపాధికి గండి కొట్టింది. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ఫంక్షన్ హాళ్లు కళకళలాడేవి. పెళ్లిళ్లు, రిసెప్షన్లతో ఎప్పుడు చూసినా బిజీగా ఉండేవి.హైదరాబాద్,రంగారెడ్డి,సాగర్ రోడ్,తో పాటు ;పలు జిల్లాలు ,పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. సాగర్ రోడ్ హైవే ,ఎల్బీ నగర్ ,చంపాపేట్ ప్రాంతాల్లో 200కు పైగా ఫంక్షన్ హాళ్లున్నాయి. అలాగే, మండల కేంద్రాలు , పాతబస్తీలోని పలు ప్రాంతాల్లోనూ ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. వీటికి తోడు కుల సంఘాల భవనాలు, చిన్న చిన్న కమ్యూనిటీ హాళ్లు వేలాదిగా ఉన్నాయి. చాలా మంది నెల, రెండు నెలల ముందుగానే ఫంక్షన్ హాల్‌లు బుక్ చేసుకుని ఏర్పాట్లకు సిద్ధమవుతుంటారు. ఎందుకంటే సమయానికి హాల్ దొరకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని అందరూ ముందుగానే బుక్ చేసుకుంటారు.