రాంచీ, మార్చి 4 (ఇయ్యాల తెలంగాణ) : దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలి .. అందుకే భారత్‌ను సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ విూడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారని రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని తెలిపారు. ఇవాళ శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదు.. దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో పలువురి నేతల్ని కలవడం జరుగుతోంది. కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేసీఆర్ తెలిపారు. యాంటీ బీజేపీ ఫ్రంట్ సాగిస్తున్నారా ? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. భారత్‌ను సరైన మార్గంలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరగాలని.. ఆ దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. ఎటువంటి ఫ్రంట్ లేదని, ఏర్పడబోయే ఫ్రంట్ మున్ముందు తెలుస్తుందన్నారు.
75 ఏండ్లలో ఆశించిన రీతిలో దేశం వృద్ధి చెందలేదన్నారు.. మంచి భారత దేశ నిర్మాణం కోసం విూ తోడ్పాటు కూడా అవసరమన్నారు.. అచ్ఛే భారత్, ప్రస్తుతం ఉన్న భారత్ కన్నా మెరుగైన దేశాన్ని సృష్టించాలన్నారు. అన్ని రంగాల్లో .. వివిధ నేతలు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మున్ముందు మరిన్ని విషయాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. కాస్త ఓపిగ్గా ఉంటే.. మున్ముందు విపులంగా విషయాలను వెల్లడిస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం..
గల్వాన్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ జార్ఖండ్‌లో రెండు కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని, గల్వాన్ కాల్పుల్లో మరణించిన కల్నల్ సంతోష్ మా తెలంగాణ బిడ్డే అని ఆ కుటుంబంతో మిగతా అమరుల కుటుంబాలకు కూడా సాయం చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.