తిరుపతి,జూన్ 08 (ఇయ్యాల తెలంగాణ) : బర్డ్ ఆసుపత్రిలో 110 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఇటీవల తమిళనాడు ధర్మపురికి చెందిన దాత శ్రీ సుబ్రమణియన్ బర్డ్ ఆసుపత్రిలో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం ఆధునీకరణకు రూ.కోటి విరాళంగా అందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యూకే సాంకేతిక సహకారంతో ఎండోలైట్ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతిక సహకారంతో తయారు చేసిన ఎక్కువ మన్నిక గల కృత్రిమ అవయవాలను ఉచితంగా అందించారు. బర్డ్ ఆసుపత్రి చేస్తున్న సేవలకు గానుఎండోలైట్ కంపెనీ వారు అసలు ధరలో 50 శాతం రాయితీతో అల్యూమినియంతో తయారు చేసిన ఈ కృత్రిమ అవయవాలను టీటీడీకి అందించారు. వీటిని ధరించిన రోగులు సాధారణ వ్యక్తుల్లాగే అత్యంత సులభంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారు. ఇదివరకు తాము జైపూర్, ఇతర ప్రాంతాల్లో తయారైన కృత్రిమ అవయవాలను ఉపయోగించామని, వాటికంటే కూడా ఈ అవయవాలు సౌకర్యవంతంగా ఉన్నాయని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బర్డ్ ఆసుపత్రి డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, రోగుల బంధువులు పాల్గొన్నారు.

