పుణే ఆగష్టు 1, (ఇయ్యాల తెలంగాణ ):‘లోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ ఘనతను ప్రజలే గుర్తించారని, ఆయనకు ‘లోకమాన్య’ బిరుదును ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు. స్వాతంత్య్ర సమర యోధుడు తిలక్ 103వ వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీకి మంగళవారం ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కూటమిలో కీలక నేత, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ హాజరవడం చర్చనీయాంశంగా మారింది.లోకమాన్య తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ మోదీకి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరద్ పవార్ హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ కూడా వేదికపై ఆసీనులయ్యారు. శరద్ పవార్, మోదీ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఇటీవల ఎన్సీపీలో చీలిక వచ్చిన తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి. ఇది ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పక్షాలకు రుచించడం లేదు.