జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి KCR

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 17 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆదివారం ఉదయం నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. ఐటీ రంగం గురించి మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ రంగం దినదినాభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రోజుకో కొత్త సంస్థ ముందుకు వస్తున్నదన్నారు. ఇవాళ ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే మేటిగా ఎదిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3 లక్షల 23 వేల 39 మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే ఉండగా, నేడు వారి సంఖ్య 9 లక్షల 5 వేల 715కు పెరిగిందన్నారు. అదేవిధంగా 2014లో ఐటీ ఎగుమతులు 57 వేల 258 కోట్ల రూపాయలు కాగా, నేడది 2 లక్షల 41 వేల 275 కోట్లకు పెరిగిందని చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, సిద్ధిపేట వంటి ప్రాంతాలకు కూడా ఐటీని విస్తరించుకొని, ఐటీ టవర్లు నిర్మించుకున్నామని వెల్లడిరచారు.

తెలంగాణ పల్లెలకు జాతీయ అవార్డులు;పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మన పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయని, చక్కటి వసతులు సమకూరి, పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయని సీఎం చెప్పారు. ఇటీవల రాష్ట్రపతి చేతులు విూదుగా మన స్థానిక సంస్థల ప్రతినిధులు 13 జాతీయ అవార్డులు అందుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. పాలనా సౌకర్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కొత్త పంచాయతీలు, అవసరాన్ని బట్టి కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రతిజిల్లా ప్రధాన కేంద్రంలో జిల్లా సవిూకృత కార్యాలయాలు, జిల్లా పోలీసు కార్యాలయ భవనాలు నిర్మించుకుంటున్నామని, దాంతో ప్రభుత్వ పాలన ప్రజలకు దగ్గరైందని చెప్పారు.

విశ్వనగరంగా హైదరాబాద్‌;హైదరాబాద్‌ నగరం ఓ మినీ ఇండియా అని సీఎం అభివర్ణించారు. ఇక్కడ అన్ని రాష్ట్రాలు, అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో కలసిమెలసి బతుకుతున్నారన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుగుణంగా గట్టి పునాదులు వేశామని, గతంలోలా మత కల్లోలాలు, గొడవలు లేకుండా ఇవాళ హైదరాబాద్‌ నగరం ప్రశాంతంగా ఉందని చెప్పారు. పారదర్శక పరిపాలన, నిరంతర విద్యుత్తు వంటి కారణాలతో అనేక అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయన్నారు. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నివారించి, సిగ్నల్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు 67 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను చేపట్టి, పూర్తిచేస్తున్నామని చెప్పారు. నగరంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసుకుంటున్నామని, ఇప్పటికే 20 ఫ్లైఓవర్లు పూర్తిచేసి ప్రారంభించుకున్నామని, అంతర్జాతీయస్థాయిలో ఇప్పటిదాకా 36 పనులు పూర్తి చేశామని తెలిపారు. హైదరాబాద్‌ నడిబొడ్డున హుస్సేన్‌ సాగర్‌ నదీ తీరంలో నూతనంగా నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం నగరానికి మరింత శోభను చేకూర్చాయని సీఎం చెప్పారు. హైదరాబాద్‌ నగరం నలువైపులా 69 వేలకోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీంతో హైదరాబాద్‌ లో మొత్తం 415 కిలోవిూటర్ల మెట్రో సౌకర్యం విస్తరించనున్నదని, విశ్వనగరంగా మరింత అభివృద్ధి చెందనున్నదని అన్నారు.

సంతోషాల సాగుబడి;కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు, మిషన్‌ కాకతీయ,పెండిరగ్‌ ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తి తదితర పనులతో తెలంగాణ సాగునీటి రంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నదని సీఎం చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, పెట్టుబడి కోసం రైతుబంధు, రైతు బీమా, 37 వేల కోట్ల రూపాయల వరకు పంటరుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలు రైతన్నకు ఊరటనిచ్చాయన్నారు. వ్యవసాయం పండుగగా మారిందని, సాగుబడిలో, దిగుబడిలో తెలంగాణ రైతన్నలు చరిత్ర తిరగరాస్తున్నారని, ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నదని, వరి ఉత్పత్తిలో పంజాబ్‌ రాష్ట్రాన్ని తలదన్ని దేశంలోనే ప్రథమ స్థానంవైపు తెలంగాణ పరుగులు పెడుతున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం శాశ్వతంగా సంపూర్ణంగా సుజల సుఫల సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా విలసిల్లేందుకు గానూ కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లోని మిగిలిన పనులను వెనువెంటనే పూర్తిచేసే కృషిలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉందని అన్నారు.
అన్నింటా నంబర్‌ 1 తెలంగాణనేడు తెలంగాణ అనేక రంగాలలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. అనతి కాలంలోనే విద్యుత్‌ రంగ సంక్షోభాన్ని అధిగమించి, అన్ని రంగాలకూ 24 గంటల పాటు వ్యవసాయానికి పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని చెప్పారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో కూడా తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. తలసరి ఆదాయంలో కూడా 3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని చెప్పారు. ఇవాళ మిషన్‌ భగీరథతో నూటికి నూరుశాతం ఇండ్లకూ ఉచితంగా నల్లాలు బిగించి, స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా దేశంలో తెలంగాణ మాత్రమేని తెలిపారు. దేశంలో ఏనాడో స్థిరపడిన పెద్దపెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అతి పిన్న వయసు ఉన్న తెలంగాణ ప్రగతి రథచక్రాలు మునుముందుకు దూసుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్‌ మార్మోగుతున్నదని, తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయని, దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదని అన్నారు. మన సమైక్యతే మనకు బలమని, ఈ జాతీయ సమైక్యతా దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దామని, తెలంగాణ ప్రగతిని ఇదేవిధంగా కొనసాగిద్దామని సీఎం పిలుపునిచ్చారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....