హైదరాబాద్, మే 1 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారస్తులు ఆటంకాలకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా పొద్దస్తమానం దంచి కొడుతున్న ఎండలు సాయంత్రం కాగానే దంచి కొడుతున్న వానలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండాకాలంలో ఇలాంటి వర్షాలతో జనాలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కేవలం గంట, అరగంట పాటు కురుస్తున్న ఏకధాటి వర్షాలు జనాలను ఆటలా కుతలం చేస్తున్నాయి. రోడ్లన్నీ నీళ్లతో నిండి పోతున్నాయి.
ఎక్కడ చూసిన డ్రైనేజిలు పొంగి పొర్లుతుండడంతో రోడ్లపైకి నీరు భారీగా వచ్చి చేరుతున్నది. ఒక పక్క వర్షపు నీరు మరో పక్క డ్రైనేజి నీరు తోడు కావడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ ల తాకిడి ఎక్కువైయిందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వాతావరణ శాఖా గత రెండు రోజుల క్రితమే యెల్లో అలర్ట్ జారీ చేసినప్పటికీ ఎండకాలంలో కురుస్తున్న వర్షాలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇటీవలే వర్షం కారణంగా సికింద్రాబాద్ కళాసిగూడ ప్రాంతంలో పాల పాకెట్ కు వెళ్లిన చిన్నారి నీళ్లలో కొట్టుకొని పోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనలు నగరంలో ఎక్కడ జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అకాల వర్షాలతో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని జనాలు ఆందోళన పడుతున్నారు.