చాగలమర్రి, జూన్ 8 (ఇయ్యాల తెలంగాణ) : అంగన్వాడి కేంద్రంలోని పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు ఐసిడిఎస్ ఆళ్లగడ్డ ప్రాజెక్ట్ సిడిపిఓ ఆదేశాల మేరకు అంగన్వాడి బడిబాట నిర్వహిస్తున్నట్లు అంగన్వాడి టీచర్ జల్లా చంద్రకళ అన్నారు. శనివారం చాగలమర్రిలోని 17వ అంగన్వాడి కేంద్రంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ చంద్రకళ మాట్లాడుతూ బడి ఈడు పిల్లల్ని తప్పకుండా అంగన్వాడి కేంద్రాలకు పంపాలని కోరుతూ వార్డులో ర్యాలీ నిర్వహించామన్నారు. రెండున్నర సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులను గుర్తించి వారిని అంగన్వాడి కేంద్రాలకు పంపే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. బడిబాట కార్యక్రమం ఈనెల ఒకటి నుండి 12వ తేదీ వరకు ఉంటుందన్నారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు మానసిక, శారీరక వృద్ధి, వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు ఆరోగ్య కార్యకర్తలతో నిర్వహిస్తూ ఉంటామన్నారు. ఒక్కపూట సంపూర్ణ భోజనంతోపాటు గుడ్డు, ఇష్టకాహారాన్ని అందిస్తున్నామన్నారు. అంగన్వాడి కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లులు, అంగన్ వాడి సహాయకురాలు సుజాత, ఆశ వర్కర్ శివలక్ష్మి, చిన్న పిల్లలు పాల్గొన్నారు.

