ఎటు చూసినా కాలువలు, వాటి విూదుగా పడవల్లో సాగే వ్యాపారం.. చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా అనిపించే వాతావరణం ఇటలీలోని వెనీస్ నగరానికి సొంతం. భారత్‌లోని అనేక నగరాలు ఇప్పుడు వెనీస్తో పోటీపడుతున్నాయి. చిన్నపాటి వర్షానికే రహదారులు కాలువల్లా మారిపోతున్నాయి. కాకపోతే వెనీస్‌లో కాలువలే మార్గాలుగా ఉంటాయి కాబట్టి నీటిలో నడిచే పడవలు, మరబోట్లను వినియోగిస్తుంటారు. భారత నగరాల్లో వర్షం పడ్డప్పుడు మాత్రమే కాలువల్లా మారతాయి కాబట్టి పడవల వినియోగం లేదు. కార్లు, ఇతర వాహనాలే పడవల మాదిరిగా మారిపోయి వర్షపు నీటి వరద ప్రవాహంలో కొట్టుకుపోతుంటాయి. ఇన్నాళ్లూ సరైన పట్టణ ప్రణాళిక (అర్బన్ ప్లానింగ్) లేని మెట్రో నగరాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉందనుకుంటే.. తాజాగా గుజరాత్ జునాగఢ్‌లో సంభవించిన వరద బీభత్సం దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలు కూడా ఇందుకు మినహాయింపు కాదని చెబుతోంది. అసలు వర్షం నగరాల పాలిట శాపంగా ఎందుకు మారుతోంది? గతంలో ఎప్పుడూ లేని రీతిలో అతి తక్కువ వ్యవధిలో అత్యధిక వర్షపాతాన్ని అందజేస్తున్న వాతావరణ పరిస్థితులే కారణమంటూ ప్రకృతిపైకే నింద నెట్టేస్తే సరిపోతుందా?ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు.. చివరకు వర్షాలు అంతగా ఉండని దేశ రాజధాని న్యూఢల్లీి సైతం వరదలో మునిగి తేలుతోంది.
గత రెండున్నర దశాబ్దాల్లో ముంబై (2020), చెన్నై (2018), హైదరాబాద్ (2000 మరియు 2020), బెంగళూరు (2017), సూరత్ (2006), కోల్‌కతా (2007), పూణే (2019) మొదలైన అన్ని మెట్రో నగరాలు భారీ వర్షాల కారణంగా నీట మునిగాయి. కేవలం మెట్రో నగరాలే కాదు, దేశంలోని పట్టణ ప్రాంతాలన్నీ గట్టి వర్షం పడితే నీట ముంపునకు గురవుతున్నాయి. పట్టణ వరదలు పూర్తిగా మానవ తప్పిదాలని, సమర్ధవంతమైన వర్షపు నీటి నిర్వహణ, ప్రణాళికతో వరదలను నివారించవచ్చని మనం మర్చిపోయినట్టు కనిపిస్తోంది. దేశ రాజధాని నగరంలో ప్రవహించే యుమునా నది ఇప్పటికీ ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. అందులో కలిసే హిండన్ ఉపనది కూడా వరదతో ఉరకలెత్తుతోంది. యమునా నది చరిత్రలోనే ఎప్పుడూ లేనంత గరిష్ట ఎత్తుకు వరద ప్రవాహం చేరుకుంది. ఇప్పటి వరకు 1978లో నమోదైన 207.49 విూటర్లే ఆల్ టైమ్ హై రికార్డ్ అనుకుంటే, తాజాగా సంభవించిన వరద గరిష్టంగా 208.66 విూటర్ల ఎత్తుకు చేరుకుంది. దాంతో ఎర్రకోట, మహాత్మ గాంధీ సమాధి ఉన్న రాజ్‌ఘాట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కల్గిన ఐటీవో ప్రాంతం సహా అనేక ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి.ఈ రుతుపవనాల సీజన్లో ఉత్తర, పశ్చిమ భారతదేశం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలకు ఉత్ప్రేరకంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పశ్చిమదిశ గాలులు తోడవుతుండగా, దక్షిణాదిన ఉన్న భారత ద్వీపకల్పంలో ఆవర్తనాలు, అల్పపీడనాలు తోడవుతున్నాయి. ఫలితంగా కుండపోత వర్షాలతో తక్కువ సమయంలో భారీ వర్షపాతం నమోదవుతోంది. ఉత్తరాదిన ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ మొదలైన రాష్ట్రాల్లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు జలసమాధి అయ్యాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఈ సీజన్ వరదల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ప్రకృతి వైపరీత్యాల వంటి పరిస్థితులు ఏర్పడి భారీ వర్షాలు కురిసినప్పుడు వరద పోటెత్తడం సహజమే. అయితే దేశంలోని పట్టణ ప్రాంతాల్లో సంభవించే వరదలకు కేవలం వైపరీత్యాలు మాత్రమే కారణం కావడం లేదు. ఈ వరదలు పట్టణ ప్రణాళికపై సవాల్ విసురుతున్నాయి.
అభివృద్ధిలో పట్టణీకరణను వేరు చేసి చూడలేం. అయితే పట్టణీకరణలో క్రమబద్ధత లేకుండా పోయింది. సాంకేతిక విజయాల వేగంతో సమానంగా మన పట్టణ యంత్రాంగం అభివృద్ధి చెందడం లేదని స్పష్టమవుతోంది. ప్రపంచ స్థాయి నగరాలను నిర్మించడానికి ఉపయోగించే భూమిని వైపరీత్యాలను సైతం తట్టుకునేలా సిద్ధం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవడమే కాదు, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి వ్యవస్థల్లో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఏ నగరానికైనా ముందస్తు పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) చాలా అవసరం, కీలకం. కానీ దేశంలో ఎక్కడ చూసినా అత్యంత నిర్లక్ష్యానికి, అవినీతికి నిలయమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది పట్టణ ప్రణాళిక విభాగమే. పెరుగుతున్న నగర జనాభాకు తగిన ఆవాసాలను ప్రణాళికబద్ధంగా నిర్మించడం అనేది దేశంలోని చండీగఢ్ వంటి కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో తప్ప మరెక్కడా కనిపించదు. ఫలితంగా వర్షపు నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా నగరం బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. వరదలు ప్రత్యక్షంగా మానవ, పశు సంపదకు ప్రాణనష్టాన్ని కల్గించడంతో పాటు ఆస్తినష్టాన్ని కూడా కలుగజేస్తున్నాయి. పరోక్షంగా ఆయా నగరాల్లో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. 2017లో బెంగళూరులో సంభవించిన వరదలు కేవలం ఐటీ సెక్టార్లో రోజుకు రూ. 200 కోట్ల నష్టాన్ని కల్గించాయని అంచనా వేశారు.ప్రణాళిక లేని పట్టణీకరణ కారణంగా కొండలు, అడవులు, సహజ ప్రవాహాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. వర్షపు నీటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా నగరం బయట నదుల్లోకి తీసుకెళ్లి కలపాల్సిన వర్షపు నీటి నాలాలపై, చెరువులపై రాత్రికి రాత్రే కాలనీలు ప్రత్యక్షమైపోతున్నాయి.
మురుగు నీటి పారుదల వ్యవస్థల నిర్వహణ కూడా సరిగా ఉండడం లేదు. వాటిలో చెత్త పేరుకుపోవడం వంటి కారణాల వల్ల కూడా వర్షపు నీరు నిలిచిపోయి వరద ముంపు ఏర్పడుతోంది. అందుకే పట్టణ ప్రాంతాల్లో సంభవించే వరదలకు మానవ తప్పిదాలే కారణమని స్పష్టమవుతోంది.పట్టణాల వరదలతో సమస్య ముగిసిపోలేదు. ప్రస్తుతం భారత జనాభాలో 35 శాతం మంది నగరాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి మన జనాభాలో దాదాపు 60 శాతం మంది గ్రామాల వీడి నగరాలకు వలసపోతారని అంచనాలున్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంతాలు పెరిగిన పట్టణీకరణతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే?నా శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా నగరాలను తీర్చిదిద్దకపోతే మరిన్ని తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే దశాబ్దంలో ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా, భారత ఉపఖండం సహా ఆగ్నేయాసియాలో తరచుగా వరదలు సంభవిస్తాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక సూచించింది. ఈ నివేదికను ఏ ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. పట్టణ ప్రణాళిక అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక వ్యాపారంగా మారిపోయింది.
ఇందులో రాజకీయ జోక్యాన్ని తగ్గించి శాస్త్రవేత్తలు, పట్టణ ప్రణాళికదారులకు వదిలేయాలి. బ్యూరోక్రసీ కఠినంగా వ్యవహరించాలి. పట్టణ సామర్థ్యం, ఒక నగరం అందుబాటులో ఉన్న నీటి వనరులు, ఇతర వనరుల లభ్యత, రోడ్లు భరించగలిగే ట్రాఫిక్ భారంతో పాటు, శాస్త్రీయమైన, తీవ్రమైన అధ్యయనం చేయాలి. నగరాల మాస్టర్ ప్లాన్లలో తరచుగా మార్పులు గందరగోళాన్ని పెంచుతున్నాయి. మాస్టర్ ప్లాన్లు ట్యాంపర్ ప్రూఫ్‌గా ఉండాలి. మార్పులు అనివార్యమైతే శాస్త్రీయ అధ్యయనం ద్వారానే అవి జరగాలి. అధిక వర్షాలు, నదీ ప్రవాహాలను పూర్తిగా నియంత్రించలేనప్పటికీ, మన నగరాల ప్రణాళికలో ప్రగతిశీల శాస్త్రీయ విధానాలను అమలుచేయనంత కాలం వరదలు ఏదో ఒక నగరంలో విధ్వంసం సృష్టిస్తూనే ఉంటాయి. ఆ విధ్వంసాలు ఒక్కోసారి నేరుగా ప్రజల ప్రాణాలు బలిచేస్తాయి. లేదంటే ఆర్థికంగా చంపేస్తాయి.