ఈ భూగోళం మీద తెలుగు వారు కాలు పెట్టని ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదేమో! తాము అడుగిడిన ప్రతి గడ్డపై తమదైన ప్రతిభాపాటవాలతో అద్భుతంగా రాణిస్తూ స్వదేశంలోనే కాక విదేశాలలో సైతం వికసిస్తుంటారు మన తెలుగు కుసుమాలు. ఆ కోవకే చెందిన వారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో గల పేరవరం లో జన్మించి వృత్తిరీత్యా ప్రస్తుతం దుబాయి లో SLADS అనే అడ్వర్టైజింగ్ సంస్థ ఆర్ట్ డైరెక్టర్ గా తన ప్రతిభను చాటుతున్న వక్కలంక లక్ష్మి. సాహితీవేత్తలైన మహాకవి పులుగుర్త రామా రావు మునిమనవరాలు, మధురకవి జొన్నలగడ్డ సోమేశ్వర అచ్యుత రామచంద్ర రావు మనవరాలు, డా జొన్నలగడ్డ మార్కండేయులు మరియు శారద ల కుమార్తెగా వారసత్వంగా అద్వితీయమైన జ్ఞానసంపదను పునికిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా ఎడారి దేశంలో సైతం మన తెలుగు రాష్ట్రాల కీర్తిని ఇనుమడింపచేస్తూ ఈ నెల 16 నుండి 19 వరకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దుబాయి వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC) లో నిర్వహించబడుతు న్న “వరల్డ్ ఆర్ట్ దుబాయి” ఆర్ట్ ఎగ్జిబిషన్ లో తన స్వహస్తాలతో రూపుదిద్దుకున్న కళాఖండాలను ప్రదర్శిస్తూ తనని తాను అంతర్జాతీయ వేదికపై మరో మారు పరిచయం చేసుకుంటోంది.సైన్సు లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన ఆమె వివాహానంతరం స్వతహాగా ఫైన్ ఆర్ట్స్ లో నిపుణుడు మరియు అప్పటికే అడ్వర్టైజింగ్ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న తన భర్త వక్కలంక శ్రీనివాస రావు ప్రోద్బలంతో పాటు స్వంత అభిరుచితో కంప్యూటరు ప్రోగ్రామింగు నేర్చుకుని, స్వయంకృషితో ఆ రంగంలో సాధించిన విశేష నైపుణ్యం ఆధారంగా దుబాయ్ ను వేదికగా చేసుకుని తన ప్రతిభను చాటుకుంటున్నది. ప్రవృత్తి పరంగా ఆర్టు అయినప్పటికీ వృత్తి రీత్యా ఆమె అడ్వర్టైజింగ్ ను ఆశయంగా ఎంచుకుని ఆ రంగంలో ఆర్టు డైరెక్టరుగా తాను సాధించిన అనుభవాన్ని సమాజంలో నలుగురికీ ఉపయోగ పడేలా చేయాలన్నది ఆమె సదాశయం. ఈ సంకల్పంతో సమాజంలోని ఔత్సాహికులకు ఉపాధి కల్పించి వారికి ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పించాలని ఆమె మస్తిష్కంలో మెదిలిన ఆలోచనకు ప్రతిరూపమే దుబాయి కేంద్రం గా నెలకొల్పిన సంస్థ యొక్క మరో శాఖను హైదరాబాద్ లో కూడా ఏర్పాటు చేసి తనదైన శైలిలో ఇతరులకు చేయూతనందిస్తున్నది. ఆర్ట్ డైరెక్టరుగా తన విశేష నైపుణ్యాన్ని రంగరించి “గల్ఫ్ గౌర్మెట్”, “విజిట్ ఆల్ ఐన్” లాంటి మాసపత్రికలకు ఆమె రూపకల్పన చేసిన అద్భుత డిజైనింగు ఆ పత్రికలకే కాక ఆమెకు కూడా ఖ్యాతినార్జించి పెట్టింది. దుబాయి ఎల్లలు దాటిన ఆమె ప్రతిభ అంతర్జాతీయంగా రొటానా హోటల్స్, సామ్ సంగ్, ADCB బ్యాంక్, ఆల్ దియాఫా స్కూలు, ఆర్ట్ కుతూరు, నోబెల్ ఎలక్ట్రానిక్స్, రెడ్ ట్యాగ్ ఫ్యాష న్ లాంటి ఎన్నో సంస్థలకు చేసిన యాడ్ క్యాంపెయిన్ లలో ఆమెలోని క్రియేటివిటీకి అద్దంపట్టాయి. కాలానుగుణంగా అడ్వర్టైజింగు రంగంలో సంభవిస్తున్న మార్పులను సునిశితంగా గమనించే ఆమె తన దృష్టిని సోషల్ మీడియా మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వైపు సారించారు.
తనదైన పంథాలో ఎన్నో మొబైల్ అప్లికేషన్స్ తన ఆఫీస్ లో UI UX డిజైన్ చేసి, టీమ్ లీడర్ గా వ్యవహరిస్తు మొబైల్ యాప్స్ డెవలప్మెంట్ కూడా చేసారు. ఒక పక్క ప్రొఫెషనల్ గా ఎదుగుతూనే తనలోని క్రియేటివిటీ ని ఎక్కడ మరుగున పడనీయకుండా, ఎప్పటికప్పుడు పెయింటింగ్స్ వేస్తూ, మరో పక్క పొలిమెర్స్ క్లే తో చూపరుల మది దోచే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చెయ్యడం మాత్రం మానలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేఖ్ ఖలీఫా బిన్ జాయెద్ అల నహ్యాన్ 2021 సంవత్సరాన్ని “స్వర్ణోత్సవ సంవత్సరం” గా ప్రకటించాడు. 6 ఏప్రిల్ 2021 న అధికారికంగా ప్రారంభమైన ఈ స్వర్ణోత్సవ సంబరాలు 31 మార్చ్ 2022 వరకు కొనసాగుతాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఘన చరిత్ర, గత 50 సంవత్సరాలలో సాధించిన ప్రగతి, ఆచారావ్యవహారాలు, సంస్కృతీసాంప్రదాయాలను ప్రతిబింబించేలా అట్టహాసంగా వేడుకలు నిర్వహించాలని ఇవి భావి తరాలకు శతాబ్ది వేడుకలను నిర్వహించేందుకు ప్రేరణనిచ్చే విధంగా రూపకల్పన చేయాలని స్వర్ణోత్సవ కమిటీ సంకల్పించింది. ఈ దిశగా చేపట్టే చర్యలు దేశంలోని యువత యొక్క ప్రతిభాపాటవాలను గుర్తించి వారిని కాలానుగుణంగా వస్తున్న అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో సుశిక్షితులను చేస్తే భవిష్యత్ లక్ష్య సాధనకు బాటలు వేస్తాయన్నది స్వర్ణోత్సవ కమిటీ ప్రగాఢ విశ్వాసం. రెండున్నర దశాబ్దాలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నివాసముంటున్న లక్ష్మికి ఈ కాలంలో అక్కడ జరిగిన అభివృద్ధిపై సంపూర్ణ అవగాహన ఉంది. అంతే కాక అక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతీసాంప్రదాయాలు, సామాజిక అంశాలు కూడా ఆమెకు సుపరిచితమే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతటా స్వర్ణోత్సవ సంబరాలు జరుగుతున్న ఈ సమయంలో దేశ విదేశాలనుండి విచ్చేసే చిత్రకారులు, హస్తకళాకారులు తమ తమ చేతులలో రూపొందిన కళాఖండాలను ఈ నెల 16 నుండి 19 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో నిర్వహించే “వరల్డ్ ఆర్ట్ దుబాయి” ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శన మరియు సరసమైన ధరలకు అమ్మకానికి పెడతారు. ప్రతి ఏటా నిర్వహించే “వరల్డ్ ఆర్ట్ దుబాయి” ఆర్ట్ ఎగ్జిబిషన్ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. లక్ష్మి కూడా ఈ స్వర్ణోత్సవ సంబరాలను పురస్కరించుకుని ఈ 50 సంవత్సరాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సాధించిన అతి ముఖ్యమైన 50 విజయాలు, అభివృద్ధి అంశాలను ప్రాతిపదికగా ఎంచుకుని 50 సంవత్సరాల ప్రగతిని ప్రతిబింబించేలా అక్రిలిక్ మిక్స్డ్ మీడియా పెయింటింగులు (80×100 సెం.మీ.) ఫ్రేమ్డ్ కాన్వాస్ల మీద చిత్రీకరించారు. ప్రపంచం నలుమూలల నుండి చిత్రకారులు, హస్తకళాకారులు, సౌందర్యారాధకులు, కళాభిమానులు విశేషంగా విచ్చేసే ఈ శుభవేళ మన తెలుగింటి ఆడబడుచు వక్కలంక లక్ష్మి తన వినూత్నమైన కళాఖండాలతో అందరి మన్ననలు పొందాలని, మన తెలుగు రాష్ట్రాలతో పాటు భారత దేశ ఖ్యాతిని ఖండాతరాలకు వ్యాపింప చేయాలని, మరెన్నో ఎగ్జిబిషన్స్ లో పాల్గొంటూ అశేష ప్రజాదరణ పొందాలని సగటు తెలుగు వారిగా నిండు మనసుతో కోరుకుందాం.